బాలకాండము : ప్రథమ సర్గము : గద్యములో

ఓమ్
శ్రీరామాయనమః
శ్రీమద్వాల్మీకి రామాయణము
బాలకాండము
ప్రథమ సర్గము
సంక్షిప్త రామాయణము

ఓమ్
తపస్స్వాధ్యాయ నిరతం
తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపృచ్ఛ
వాల్మీకిర్మునిపుంగవమ్ ||

( రామాయణ బాలకాండలో ప్రథమ సర్గలో నారద మహాముని మహర్షి వాల్మీకికి అతి క్లుప్తముగా వివరించిన రామాయణ కథని సంక్షిప్తరామాయణ మనబడినది్. నారదమహముని చెప్పిన ఫలశ్రుతితో కూడిన రామాయణ కథయే ప్రథమ సర్గ తాత్పర్యము.)

తపస్వీ మరియు వాగ్విదులలో శ్రేష్ఠుడు , వేదాధ్యయననిరతుడు ముని శేఖరుడు అయిన నారదుని తపస్వి అయిన వాల్మీకి మహర్షి ఇట్లు ప్రశ్నించెను.

" ఓ మహర్షీ ! ఈ సమస్త లోకములలో సకల సద్గుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు , సత్యవాక్యుడు , దృఢసంకల్పము గలవాడు ఎవడు ? సర్వభూతముల హితము కోరువాడు , విద్వాంసుడు , సమర్థుడు , ప్రియదర్శనుడు, ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు ఏవడు ? శోభలతో విలసిల్లువాడు , అసూయలేనివాడు కుపితుడైనచో దేవాసురలను సైతము భయకంపితులను జేయగలవాడు ఎవడు ? ఓ మహర్షీ ! ఆట్టి మహపురుషుని గురించి తెలిసికొనుటకు మిక్కిలి కుతూహలముతో నున్నాను. ఓ మహర్షీ ! మీరు సర్వజ్ఞులు అట్టి మహపురుషుని గురించి తెలుపుటకు సమర్థులు ! "

త్రిలోకజ్ఞుడైన నారదుడు ఆ వాల్మికి చెప్పిన మాటలను విని సంతసించి ఇట్లు పలికెను .

" ఓ మునివర్యా ! నీ చేత కీర్తింపబడిన బహువిధములైన గుణములు ఒకరియందే యుండట సాధారణముగా దుర్లభము. అయిననూ నాకు తెలిసినంత వరకు అట్టి గుణములుగల ఉత్తమపురుషుని గురించి తెలిపెదను వినుము. ఇక్ష్వాకువంశము మిక్కిలి ప్రసిద్ధిగాంచినది. ఆ వంశములోని శ్రీరాముడు మనోనిగ్రహము కలవాడు, మహావీరుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు, నీతిశాస్త్రము తెలిసినవాడు, వాక్చాతుర్యము గలవాడు , శ్రీమంతుడు, శత్రువులను సంహరించువాడు ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు కలవాడు, శంఖములాంటి కంఠము కలవాడు, ఉన్నతమైన హనువులు కలవాడు , విశాలమైన వక్షస్థలము గలవాడు , అద్భుతమైన ధనస్సు కలవాడు , గూఢముగా నున్న జత్రువులు కలవాడు , అంతఃశత్రువులను అదుపుచేయగలవాడు , ఆజానుబాహువు, సుశిరము గలవాడు , సులలాటము గలవాడు, సువిక్రముడు, సమముగా అంగసౌష్ఠవము గలవాడు, స్నిగ్ధవర్ణుడు, పరాక్రమవంతుడు , సీనవక్షుడు, విశాలాక్షుడు , శుభలక్షణములు గలవాడు ".

" అతడు ధర్మజ్ఞుడు , సత్యసంధుడు , ప్రజలయొక్క హితము కోరువాడు , యశస్వీ , జ్ఞానసంపన్నుడు, శుచిమంతుడు, ప్రజాపతి తో సమానమైనవాడు , విష్ణువుతో సమానమైనవాడు , శత్రువులను హరించువాడు , జీవ లోకములను రక్షించువాడు, ధర్మమును ఆచరించుచూ ధర్మమును రక్షించువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించినవారిని రక్షించువాడు, వేద వేదాంగముల తత్వము తెలిసినవాడు , ధనుర్వేదములో ఘనుడు , సర్వశాస్త్రముల అర్థము తత్వము తెలిసినవాడు , స్మృతిమంతుడు , ప్రతిభావంతుడు, సమస్తలోకమునకు ప్రీతిపాత్రుడు , విచక్షణ గలవాడు "

" నిరంతరము నదులు సముద్రములో కలిసినటుల సత్పురుషులు శ్రీరాముని చేరుచుందురు. అతడు ఆర్యుడు. ఆందరి ఎడల సమభావముతో నుండువాడు. ఏల్లవేళలో ప్రియమైన దర్శనము ఇచ్చువాడు. కౌసల్యానందుడైన శ్రీరాముడు అన్ని గుణములతో విలసించుచున్నవాడు. సముద్రమువలె గంభీరమైనవాడు. ధైర్యములో హిమవంతుడు. పరాక్రమములో విష్ణునితో సమానమైనవాడు. చంద్రునివలె ప్రియమైన దర్శనమిచ్చువాడు . క్రోధములో కాలాగ్నితో సమానమైనవాడు. సహనమున భూదేవితో సమానమైనవాడు. కుబేరునివలె త్యాగబుద్ధి కలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటి వాడు".

" సత్యపరాక్రమవంతుడైన శ్రీరాముడు ఈ విధముగా అనేక గుణములతో సంపన్నుడు. జ్యేష్ఠుడు , శ్రేష్ఠ గుణములతో సంపన్నుడు.

"అతడు ఆ దశరథుని యొక్క ప్రియపుత్రుడు. దశరథుడు ప్రకృతి ( మంత్రివర్గము) చే చెప్పబడిన హితము ననుసరించి ప్రకృతి ( ప్రజల) హితము కొరకై శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. ఆ అభిషేక సన్నాహములను దశరథుని భార్య కైకేయి తెలిసికొనెను. పూర్వము దశరథుడు కైకేయికి వరములను ఇచ్చెను. ఈ సందర్బమున ఆమె శ్రీరాముని వనము పంపమని , భరతుని పట్టాభిషేకము చేయమని, రెండు వరములను కోరెను".

"సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశములచేత బంధింపబడి ప్రియసుతుడైన రాముని వనములకు పంపవలసివచ్చెను. పితృవాక్యపరిపాలనకు శ్రీరాముడు తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి కైకేయికి ప్రియముగూర్చుటకై అ వీరుడు వనవాసమునకు బయలుదేరెను ",

"సుమిత్రానందుడైన ఆ లక్ష్మణుడు మిక్కిలి వినయసంపన్నుడు , రామునికి ప్రియ సోదరుడు , రామునియందు భక్తి తత్పరుడు. ఆవిధముగా వనములకు పోవుచున్న అ రాముని సోదరుడగు లక్ష్మణుడు అనుసరించెను".

" శ్రీరామునకు ధర్మపత్ని , నిత్యము ప్రాణముతో సమానురాలు , జనకుని పుత్రిక అయిన సీతాదేవి దేవమాయ వలె పుట్టింపబడినది. సర్వలక్షణములతో సంపన్నురాలు , స్త్రీలలో ఉత్తమమైన వధువు . అట్టి ఆమె చంద్రుని అనుసరించిన రోహిణివలె శ్రీరాముని అనుసరించెను"

" అయోధ్యపుర పౌరులు అదే విధముగా దశరథ మహారాజు శ్రీరాముని చాలా దూరము అనుగమించిరి. శ్రీరాముడు గంగాతీరమున గల శ్రుంగిబేరపురమున తన భక్తుడు, నిషాదులకు రాజు అయిన గుహుని కలిసికొనిన పిమ్మట రథ సారథిని వెనుకకు పంపివేసెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుహుని తో కలిసి వనములలో పోవుచూ జలసమృద్ధమైన గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశానుసారము సీతా రామలక్ష్మణులు మందాకినీ నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట రమ్యమైన పర్ణశాలను నిర్మించికొని అ ముగ్గురు దేవ గంధర్వ సదృశులై ప్రశాంతముగా నివశింపసాగిరి. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా దశరథ మహారాజు పుత్రశోకముతో విలపించుచూ స్వర్గస్థుడాయెను".

"దశరథుని మరణానంతరము వశిష్ఠుడు తదితర బ్రాహ్మణోత్తములు భరతుని రాజ్యాధికారము స్వీకరింపమని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్షలేని ఆ భరతుడు పూజ్యుడైన శ్రీరాముని అనుగ్రహము కోరుటకు వనములకు బయలు దేరెను. ప్రసన్నహృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో ' ఓ ధర్మజ్ఞా , జ్యేష్ఠుడవు , శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు', అని పలుకుచూ శ్రీరాముని వేడుకొనెను".

" మిక్కిలి ఔదార్యముగలవాడు సుముఖుడు , మహాయశస్సు గలవాడు అయిన శ్రీరాముడు, ఇతరుల ప్రార్థనలను మన్నించువాడైనప్పటికీ పిత్రాదేశము అనుసరించి రాజ్యాధికారము చేపట్టుటకు ఇష్టపడలేదు. ఆప్పుడు శ్రీరాముడు తనకు ప్రతినిథిగా తనపాదుకలను భరతునికి ఇచ్చి పలువిధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. తన లక్ష్యమునెరవేరకున్నను భరతుడు రామ పాదుకలను సేవించుచూ నందిగ్రామమునందు ఉండి రామ ఆగమన ఆకాంక్షతో రాజ్యపాలన చేయసాగెను. భరతుడు తిరిగి వెళ్ళిన తరువాత జితేంద్రియుడు సత్యసంధుడైన శ్రీరాముడు తన దర్శనమునకు పౌరులు, జనులు అచటికి వచ్చుచుండుట గమనించి, అది మునుల ఏకాగ్రతకు భంగము అని తలచి దండకారణ్యము ప్రవేశించెను".

"ఆ మహారణ్యము ప్రవేశించి రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడను రాక్షసుని సంహరించెను. పిమ్మట శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని అగస్త్యమునిని మరియు ఆయన సోదరుని దర్శించెను. ఆగస్త్యమహాముని ఆదేశానుసారము ఇంద్ర చాపమును, ఖడ్గమును , అక్షయములైన బాణములుగల తూణీరములను గ్రహించి శ్రీరాముడు పరమప్రీతుడాయెను".

" వనవాసులతో గూడి శ్రీరాముడు ఆ వనములో నివశించుచుండగా అచటి ఋషులందరూ తపోభంగము కలిగించుచున్న రాక్షసులను వధింపమని కోరుటకై విచ్చేసిరి. శ్రీరాముడు వారి ప్రార్థనలను ఆలకించెను. దండకారణ్యములో వశించుచున్న అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరులకి ఆరాక్షసులను వధించుటకు ప్రతిజ్ఞచేసెను ".

"అచటనే జనస్థాననివాసిని అయిన శూర్పణఖ అనబడు రాక్షసి కామరూపిణి. రాముడు ఆమెను వికృత రూపిణిని గావించెను . పిమ్మట శూర్పణఖ వాక్యములతో రెచ్చ గొట్ట బడిన ఖరుడు , త్రిశిరుడు , మరియు దూషణుడు కలిసి అనేకమైన రాక్షసులతో గూడి యుద్ధసన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఖర త్రిశిర దూషణాదులతో సహా జనస్థాన నివాసులైన పదునాలుగువేలమంది రాక్షసులను హతమొనర్చెను".

" రావణుడు తన జ్ఞాతుల వధను గురించి విని క్రోధమూర్ఛితుడై మారీచుడను రాక్షసుని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు పెక్కువిధముల రావణుని శ్రీరాముడు శక్తిమంతుడు ఆయనతో విరోధము తగదని చెప్పెను. అతని వాక్యములను ఆదరించక , కాలము సమీపించిన రావణుడు మారీచునితో కూడి శ్రీరాముని ఆశ్రమ సమీపమునకు చేరెను".

"పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహాయముతో రాజకుమారులు ఇద్దరినీ ఆశ్రమమునుండి దూరముగా పంపి రామునియొక్క భార్యను అపహిరించెను. దారిలో తనను అడ్డగించిన జటాయువుని హతమొనర్చెను. అవసాన దశలోనున్న జటాయువు రావణుడు సీతను అపహరించిన వార్తను శ్రీరామునకు తెలిపి కన్నుమూసెను . జటాయువు మరణముతో శ్రీరాముడు శోకసంతుప్తుడై జటాయువునకు అంత్య సంస్కారములను నిర్వహించెను" .

" సీతాదేవిని అన్వేషించుచూ మార్గములో కబంధుడను రాక్షసుని చూచెను. ఆతడు వికృతరూపముతో చూచుటకు భయంకరుడై ఉండెను. శ్రీరాముడు ఆ దానవుని హతమొనర్చి , అతని కళేబరమును దహింపజేసెను. తత్ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాపవిముక్తుడైన కబంధుడు శ్రీరామునితో "
' ఓ రామా ! సమీపములో ధర్మచారిణి మరియూ భక్తురాలు అయిన శబరి కలదు . ఆమె అతిధి సత్కారములందు నిరతురాలు . అ శబరి వద్దకు వెళ్ళుము'
అని పలికెను. శత్రుసూదనుడైన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో ఫలములను అర్పించి ఆయనను పూజించెను"

" సీతాన్వేషణలో పంపాసరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను . ఆ వానరోత్తముని వచనములను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తనవృత్తాంతము అంతయును తెలిపెను. సీతాఅపహరణగాధను కూడా తెలిపెను. సుగ్రీవుడు కూడా అది అంతావిని శ్రీరామునకు తోడ్పడుటవలన తనకు ప్రయోజనము కలుగునని భావించి శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రికి అంగీకరించెను. పిమ్మట ఆ వానర రాజు దుఃఖితుడై ఉండుట గమనించి ఆ దుఃఖకారణమేమని అతనిని అడిగెను. అప్పుడు శ్రీరామునకు తన పై వాలిక గల ప్రేమ భావములు భేదభావములు సర్వము మిక్కిలి దుఃఖము తో నివేదించెను. అనంతరము శ్రీరాముడు వాలిని వధించుటకు ప్రతిజ్ఞచేసెను".

"అప్పుడు సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గురించి శ్రీరామునకు నివేదించెను".

"వాలిని హతమర్చుటకు శ్రీరామునకు గలపరాక్రమము విషయమున సుగ్రీవుని మదిలో సందేహము మెదలుచుండెను. రాఘవునకు వాలిపరాక్రమము గురించి చెప్పుటకు , దుందుభి అను రాక్షసుని కళేబరము చూపెను. మహాపర్వత సదృశమైన ఆ కళేబరము చూచి శ్రీరాముడు పాదాంగుష్ఠములతో దానిని దశయోజనముల దూరము చిమ్మెను. సుగ్రీవుని సందేహములు తీర్చుటకు శ్రీరాముడు తన బాణముతో వరుసగనున్న ఏడు మద్దిచెట్లను, సమీపమునున్న ఒక పర్వతమును, రసాతలము భేదించెను. ఆ బాణము తిరిగి అదేవేగముతో శ్రీరాముని తూణీరములో చేరెను".

"అప్పుడు ఆ సుగ్రీవుడు ప్రీతిపొందినమనస్సుతో విశ్వాసముతో శ్రీరామునితో సహా గుహవలెనున్న కిష్కింధకు వెడలెను. అచట సువర్ణ పింగళములుగల ఆ వానర శ్రేష్ఠుడు వాలిని పిలుచుటకై బిగ్గరగా గర్జించెను. అ మహా నాదముతో వానరరాజైన వాలి బయటికివచ్చెను. భార్య అయిన తారచేత నివారింపబడినప్పటికీ వాలి సుగ్రీవునితో సంగ్రామములో తలపడెను. అప్పుడు ఒకే ఒక బాణముతో రాఘవుడు వాలిని సంహరించెను. పిమ్మట సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసెను".

" పిమ్మట ఆ వానరరాజు వానరులందరిని పిలచి వారిని సీతాన్వేషణకై అన్ని దిశలకు పంపెను. అప్పుడు మహాబలవంతుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి మాటలను అనుసరించి శతయోజనముల విస్తీర్ణముగల లవణసముద్రమును దాటెను. ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. అచట అశోకవనములో రామ ధ్యానములో నున్న సీతాదేవిని కనుగొనెను. హనుమంతుడు శ్రీరాముడిచ్చిన ఆనవాలును సమర్పించి , రామసుగ్రీవుల మైత్రిని మరియూ రామశోకమును వివరించి ఆమెకి విశ్వాసము కలిగించెను" .

" పిమ్మట అశోకవన తోరణమును ధ్వంసము చేయసాగెను. ఆ వాయుసుతుడు పంచ సేనాపతులను, సప్త మంత్రిసుతులను హతమార్చెను . పిమ్మట శూరుడైన అక్షయకుమారుని హతమొనర్చెను. పిదప ఇంద్రజిత్తుని బ్రహ్మాస్త్రమునకు లోబడెను. పిత్ర మహావరముచేత ఆ అస్త్రమునుండి విముక్తుడై నప్పటికీ ఆ ఆస్త్రమునకు బద్ధుడైయుండి రాక్షసులు పెట్టుబాధలను భరించెను. పిమ్మట సీతాదేవి వున్నస్థలము తప్ప మిగతా లంకాపురిని దగ్ధమొనరించి , సీతాదేవి కుశలవార్తను శ్రీరాముని తెలుపుటకై ఆ మహాకపి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చి మహత్ముడైన శ్రీరామునికి ప్రదక్షిణ మొనర్చి సీతాదేవిని చూచితిని అని శ్రీరామునికి నివేదించెను".

"పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో సహా సముద్ర తీరమునకు చేరి సూర్యకిరణములతో సమానమైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు తన నిజస్వరూపము ప్రకటించెను. పిమ్మట సముద్రుని వచనములప్రకారము నలుని ద్వారా సేతువును నిర్మించెను. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని హతమార్చెను. తదనంతరము శ్రీరాముడు సీతను సమీపించి ఆమెను స్వీకరించుటకు వెనకాడెను. అప్పుడు ఆమెతో జనసంసదిలో పరుషవచనములను పలికెను. ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిమ్మట అగ్నిదేవుని వచనములతో సీత విగతకల్మష అని తెలిసుకొని శ్రీరాముడు పరమసంతుష్ఠుడాయెను. అప్పుడు దేవతలందరునూ శ్రీరాముని కొనియాడిరి".

" మహాత్ముడైన శ్రీరాముడు చేసిన పనితో ముల్లోకముల లోని చరాచరములు దేవ ఋషిగణములు సంతోషపడిరి. పిదప శ్రీరాముడు విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. కృతకృత్యుడైన శ్రీరాముడు ప్రసన్న మనస్సు గలవాడాయెను. దేవతలనుంచి వరముపొంది ఆ వరముతో ఆ రామరావణ యుద్ధములో మృతులైన వానర వీరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు పుష్పకవిమానములో అందరితో కలిసి అయోధ్యకు బయలుదేరెను".

" సత్యపరాక్రమవంతుడగు శ్రీరాముడు భరద్వాజాశ్రమము చేరి హనుమంతుని భరతుని కడకు పంపెను. శ్రీరాముడు ప్రయాణ సమయమున పుష్పక విమానమును అధిరోహించి సుగ్రీవాదులకు విశేషగాధలను తెలుపుచూ వారితో నందిగ్రామము చేరెను. నందిగ్రామములో జటాదీక్షను పరిత్యజించి , తనసోదరులని కలిసికొని , సీతాదేవితో సహా అయోధ్యలో పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును మళ్ళీపొందెను".

"రామరాజ్యమున ప్రజలందరూ సంతోషముతో సుఖసౌభాగ్యములతో ధర్మమార్గముననే ప్రవర్తించెదరు. భయవర్జితులై దుర్బిక్షములేకుండా ఆరోగ్య భాగ్యములతో జీవించుచుందురు. ఆ రామరాజ్యములో పుత్రమరణము లేకుండును. స్త్రీలు పాతివత్రధర్మములను పాటించుచూ నిత్యసుమంగుళులై వర్ధిల్లుచుండెదరు. అగ్నిప్రమాదములుగాని జలప్రమాదములుగాని వాయు భయములుగాని లేకుండును. అట్లే క్షుద్బాధ గాని చోరభయముగాని లేకుండును. రాజ్యములోని నగరములు తదితరప్రదేశములు ధన ధాన్యములతో తులతూగుచూ జనులు కృతయుగములో వలె ఎల్లప్పుడునూ సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు".

"శ్రీరాముడు అనేకమైన అశ్వమేధ యజ్ఞములను సువర్ణక యాగములను చేయును. బ్రాహ్మణోత్తములకు పండితులకూ కోట్లకొలదీ గోవులను దానము చేయును. అపరితమైన దానములతో మహా యశస్సు పొందును. ఆ రాఘవుడు క్షత్రియవంశమును శతగుణముల వృద్ధిపరచును . నాలుగు వర్ణములవారిని తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. శ్రీరాముడు పదివేల సంవత్సరములు తరువాత పదివందల సంవత్సరములు ప్రజానురంజకముగా పాలించి అనంతరము బ్రహ్మలోకమును చేరును".

"ఈ రామచరితము పవిత్రమైనది పాపములను రూపుమాపును మరియు పుణ్యసాధనము. వేదసారముతో సమ్మితమైనది. ఈ రామ చరితము ప్రతిదినము పఠించువారు సర్వపాపములనుంచి విముక్తులగుదురు. ఈ రామాయణము పఠించువారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రులకు పరివారములకు క్షేమలాభములు ప్రాప్తించును. అంత్యకాలమున మోక్షప్రాప్తి కలుగును . ఈ రామాయణము పఠించిన ద్విజులు వేదవేదాంగములలో శాస్త్రముల లో పండితులగుదురు . క్షత్రియులు రాజ్యాధికారముపొందుదురు. వణిజులు వ్యాపార లాభములను పొందుదురు. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులగుదురు "

ఏతదాఖ్యాన సమాయుష్యం
పఠన్ రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః
ప్రేత్య స్వర్గే మహీయతే ||

పఠన్ ద్విజో వాక్
వృషభత్వ మీయాత్
స్యాత్ క్షత్రియో భూమి
పతిత్వ మీయాత్ |
వణిగ్జనః పణ్య
ఫలత్వ మీయాత్
జనశ్చ శూద్రో అపి
మహత్వమీయాత్ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకియే ఆది కావ్యే బాల కాండే
సంక్షిప్త రామాయణోనామ
ప్రధమసర్గః
సమాప్తము ||

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణములోని బాలకాండలో సంక్షిప్త రామాయణ మనబడు
ప్రథమ సర్గము సమాప్తము ||

|| ఒమ్ తత్ సత్ ||